Jio 5G : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ జియో. ఒకప్పుడు ఒక్క జీబీ డేటా కొనుక్కోవాలంటే కనీసం వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందుకే ఆచీతూచీ డేటాను ఉపయోగించుకునే వాళ్లం. కానీ.. ఇప్పుడు వందల జీబీ డేటా కూడా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. డేటా చాలా ఛీప్ అయిపోయింది. దానికి కారణం జియో. అవును.. రావడం రావడమే కుంభస్థలాన్ని ఢీకొట్టాలి అన్నట్టుగా దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి లాంచింగ్ అప్పుడే ఉచితం వాయిస్ కాల్స్, డేటా ఇచ్చి అందరు యూజర్లను తనవైపునకు తిప్పుకుంది జియో.
దీంతో అందరూ జియో వెంట పడ్డారు. కొన్ని నెలల పాటు ఉచితంగా అన్నీ అందించిన తర్వాత ఫ్రీ ఆఫర్స్ ను ఎత్తేసింది జియో. అయినా కూడా తక్కువ ధరలకే ప్రస్తుతం వాయిస్, డేటాను అందిస్తోంది. అందుకే చాలామంది ఇతర నెట్ వర్క్స్ ను ఉపయోగించేవాళ్లు కూడా జియోకు మారిపోయారు. దీంతో ఇతర నెట్ వర్క్స్ కూడా జియో దెబ్బకు తలొగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం జియో మరో ముందడుగు వేసి దేశవ్యాప్తంగా 5జీ సేవలను తీసుకొచ్చింది. 2023 చివరకల్లా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 5జీ సేవలను విస్తరించాలని జియో ప్రణాళిక వేసింది.
Jio 5G : సంక్రాంతి సందర్భంగా 100 నగరాలకు విస్తరించిన జియో 5జీ సేవలు
జియో 5జీ ని ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని నగరాలకే పరిమితం చేశారు. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లోనే ముందుగా 5జీ సేవలను ప్రారంభించారు. కానీ.. సంక్రాంతి తర్వాత 100 కు పైగా నగరాల్లో జియో సేవలను విస్తరించారు. అందులో ఛత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్, దర్గ్, భిలాయ్ నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. అలాగే.. బీహార్ లోని పాట్నా, ముజఫర్ నగర్, జార్ఖండ్ లోని రాంచి, జంషెడ్ పూర్ లో, కర్ణాటకలోని బిజాపూర్, ఉడిపి, కలాబురగి(గుల్బర్గా), బల్లారి, ఒడిశాలోని రూర్కెలా, బ్రహ్మాపూర్ లో, కేరళలోని కొల్లంలో, ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరులో, మహారాష్ట్రలోని అమరావతిలో కొత్తగా సేవలు ప్రారంభం అయ్యాయి. జియో ట్రూ 5జీ పేరుతో జియో ఈ సేవలను ప్రారంభించింది.
గత సంవత్సరం అక్టోబర్ 4న ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్ కతాలో జియో 5జీ సేవలు మొదలయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ 22 న చెన్నై, నాతడ్ వారాలో ప్రారంభం అయ్యాయి. నవంబర్ 10న బెంగళూరు, హైదరాబాద్ లో, నవంబర్ 11న గురుగ్రామ్, నొయిడా, ఘజియాబాద్, ఫరిదాబాద్ లో, నవంబర్ 23న పుణెలో, నవంబర్ 25న గుజరాత్ లోని 35 జిల్లాలలో, డిసెంబర్ 14న ఉజ్జయని టెంపుల్స్ లో, డిసెంబర్ 20 న కొచ్చి, గురువాయూర్ గుడిలో, డిసెంబర్ 26న తిరుమల, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరులో, డిసెంబర్ 28న లక్నో, త్రివేండ్రం, మైసూర్, నాసిక్, ఔరంగాబాద్, ఛండీగఢ్, మొహలీ, పంచ్ కులా, జిరాక్ పూర్, ఖారర్, దెరబస్సీలో, డిసెంబర్ 29న భోపాల్, ఇండోర్ లో, జనవరి 5, 2023న భువనేశ్వర్, కటక్ లో, జనవరి 6, 2023న జబల్ పూర్, గ్వాలియర్, లుథియానా, సిలిగురిలో, జనవరి 7, 2023 న జైపూర్, జోధ్ పూర్, ఉదయ్ పూర్ లో జనవరి 7, 2023న ఆగ్రా, కాన్ పూర్, మీరట్, ప్రయాగ్ రాజ్, తిరుపతి, నెల్లూరు, కొజికోడ్, త్రిస్సూర్, నాగ్ పూర్, అహ్మద్ నగర్ లో, జనవరి 15 న రాయ్ పూర్, దుర్గ్, భిలాయ్, పాట్నా, ముజఫర్ నగర్, రాంచి, జంషెడ్ పూర్, ఉడుపి, కలాబురిగి, బళ్లారీ, రూర్కెలా, బ్రహ్మాపూర్, కొల్లం, ఏలూరు, అమరావతిలో జియో 5జీ సేవలను ప్రారంభించారు.