IPL 2023 : ఐపీఎల్ అభిమానులకు ఇది ఒక పండుగ అని చెప్పుకోవాలి. ఇన్నిరోజులు ఐపీఎల్ చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ చానెల్ మీదనే ఆధారపడి ఉండేవాళ్లు. ఏదో థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించి కష్టపడి ఎలాగోలా ఐపీఎల్ మ్యాచ్ లు చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ.. జియో మాత్రం ఉచితంగా రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లను అందిస్తోంది.
దీంతో అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో జియో సినిమా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని ఫోన్లలోనే మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఎన్నిరోజులు ఇలా ఉచితంగా జియో.. ఐపీఎల్ మ్యాచ్ లను అందిస్తుందో చాలామందికి తెలియదు. ఈనేపథ్యంలో ఐపీఎల్ అభిమానులకు జియో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
IPL 2023 : ఐపీఎల్ తర్వాత జియో సినిమా ఉచితం కాదు
ఐపీఎల్ మ్యాచ్ లు పూర్తయ్యాక జియో సినిమా యాప్ లో కంటెంట్ ను చూడటానికి ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఎలా ప్లాన్స్ తీసుకుంటామో.. జియో సినిమాకు కూడా ఏదైనా ప్లాన్ తీసుకుంటేనే అందులో ఉండే కంటెంట్ ను యాక్సెస్ చేసుకునే వీలు ఉంటుంది.
నిజానికి జియో సినిమా అనేది కూడా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి వాటితో పోటీ పడేందుకు జియో బాగా కష్టపడుతోంది. అందుకే జనాలకు జియో సినిమా యాప్ ను అలవాటు చేయడం కోసం ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను అందిస్తోంది. కానీ.. అది మే 28 వరకే జియో నుంచి ఉచితంగా కంటెంట్ పొందొచ్చు. ఎందుకంటే.. ఐపీఎల్ చివరి మ్యాచ్ జరిగేది ఆరోజే. ఆ తర్వాత జియో సినిమా యాప్ లోని కంటెంట్ ను యాక్సెస్ చేసుకోవాలంటే ప్రీమియం ప్లాన్ కు మారాల్సిందే. అయితే.. జియో సినిమా ప్రైస్ ప్లాన్ ను ఇంకా జియో వెల్లడించలేదు.