Tinder Match : ఓ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ కోసం టిండర్ యాప్ ను నమ్ముకున్నాడు. టిండర్ యాప్ లో ఓ యువతిని చివరకు పరిచయం చేసుకున్నాడు. హమ్మయ్య.. గర్ల్ ఫ్రెండ్ దొరికింది అనుకున్నాడు. కానీ.. చివరకు ఆ యువతి పెద్ద స్కామర్ అని తెలుసుకోలేక అడ్డంగా మోసపోయాడు. ఎంతలా అంటే 14 కోట్లు నష్టపోయాడు. ఎలాగో తెలుసుకుందాం రండి.
సైబర్ నేరాల గురించి రోజూ చూస్తూనే ఉంటాం.. వింటూనే వింటాం కానీ.. సైబర్ నేరాలు మనదాకా వస్తాయా అని అనుకుంటాం. కానీ.. సైబర్ నేరగాళ్లు ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు అందరినీ టార్గెట్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు వాళ్లను వలలో వేసి అకౌంట్ గుల్ల చేస్తారు. తాజాగా ఓ వ్యక్తిని అలాగే చేశారు.
Tinder Match : ఆ వ్యక్తి ఎలా డబ్బులు పోగొట్టుకున్నాడంటే?
హాంగ్ కాంగ్ లో ఉండే 55 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి.. టిండర్ యాప్ లో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సప్ లో రోజూ చాట్ చేసుకునేవారు. తను సింగపూర్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్రోకర్ అని పరిచయం చేసుకుంది. ట్రేడింగ్ చేసి డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చని ఆ యువతి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి.. అతడికి ఆశ చూపారు.
ఓ బోగస్ ట్రేడింగ్ వెబ్ సైట్ లింక్ ను అతడికి ఇచ్చింది. ఆ వెబ్ సైట్ లో ట్రేడింగ్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో ఆ వ్యక్తి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న 14.2 మిలియన్ హాంగ్ కాంగ్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాడు. అవి మన కరెన్సీలో సుమారు రూ.14 కోట్లు. పెట్టుబడి పెట్టిన చాలా రోజుల తర్వాత కూడా ఇంకా డబ్బులు రాకపోవడంతో ఆమెను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. తను మోసపోయాడని. సైబర్ నేరగాళ్లు తనను మోసం చేశారని తెలుసుకొని లబోదిబోమన్నాడు ఆ వ్యక్తి.