Microsoft : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే లేఆఫ్. అంటే ఉద్యోగుల తొలగింపు. ఎవరైనా ఉద్యోగులను చేర్చుకుంటారు కానీ.. తొలగించడం అనేది పెద్ద సంఖ్యలో ఉండదు. ఒకరిద్దరిని తొలగిస్తే అది ఇంటర్నల్ కిందికి వస్తుంది. కానీ.. వేల మందిని ఒకేసారి ఊచకోత కోసినట్టుగా జాబ్ లో నుంచి పీకేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీతో పాటు మరికొన్ని ఇతర ఇండస్ట్రీల లోనూ అదే జరుగుతోంది. ఎంఎన్సీ కంపెనీలే ఉద్యోగులను కళ్లు మూసి తెరిసే లోపు తీసేస్తున్నాయి. ఇంటికి పంపించేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపునకు ముందు శ్రీకారం చుట్టింది ట్విట్టర్ కంపెనీ. ఆ తర్వాత పెద్ద పెద్ద సంస్థలు అన్నీ ట్విట్టర్ బాటలోనే నడిచాయి. అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ కంపెనీ ఉద్యోగులను తొలగించాయి.
తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడుస్తోంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను అంటే.. మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. నిన్నటి నుంచే అంటే జనవరి 18 నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్టాఫ్ అందరికీ తెలియజేశారు. ఓవైపు ఉద్యోగులను తొలగించినప్పటికీ.. స్ట్రాటెజిక్ ఏరియాలో భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెడుతూనే ఉంటుందని నాదెళ్ల వెల్లడించారు.
Microsoft : ప్రపంచమంతా ప్రస్తుతం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటోందని చెప్పిన నాదెళ్ల
ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుందని నాదెళ్ల తెలిపారు. అందుకే.. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టామన్నారు. అయితే.. కొత్త రిసోర్సెస్ అవసరం అయితే ఖచ్చితంగా మళ్లీ తీసుకుంటామని.. ఇది కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. తొలగించిన ఉద్యోగులకు 60 రోజుల నోటీస్ పీరియడ్ తో పాటు 6 నెలల పాటు కంపెనీకి చెందిన పలు బెనిఫిట్స్ లభిస్తాయని నాదెళ్ల వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు అంటేనే డెడికేషన్ ను కేరాఫ్ అడ్రస్ అని చెప్పిన సత్యా.. ప్రస్తుతం కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బెటర్ గా పర్ ఫార్మ్ చేయాలి అనే విధంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా స్టాఫ్ కు పంపించిన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుండటంతో ప్రస్తుతం కాలేజీ నుంచి బయటికి వచ్చే యూత్ భయపడిపోతున్నారు. ఐటీ ఇండస్ట్రీలో చేరాలంటేనే టెన్షన్ పడుతున్నారు. ఇంకా మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.