PAN Aadhaar Link : ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి కేంద్రం.. పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలని చెబుతోంది. నకిలీ కార్డులను నివారించడానికి, సైబర్ నేరాలను ఆపడానికి, ఆధార్ కార్డులతో పలు రకాల నేరాలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. దానికి గడువు కూడా విధించింది. ఈ మార్చి 31 లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని చెప్పింది.
కానీ.. చాలామంది ఇంకా ఆధార్ తో పాన్ ను లింక్ చేసుకోలేదు. కొందరికి ఆన్ లైన్ విధానం తెలియక, మరికొందరు నిర్లక్ష్యంతో లింక్ చేసుకోలేదు. నిజానికి ఆధార్, పాన్ లింక్ చేసుకోకపోతే చాలా నష్టాలు ఉంటాయి. పాన్ కార్డు పని చేయదు. ఎలాంటి ఆన్ లైన్ సర్వీసుల్లోనూ ఆధార్ పనిచేయదు. అందుకే వెంటనే ఆధార్, పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. అయినా చాలామంది వినియోగదారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో మరో అవకాశం ఇస్తూ గడువును పెంచింది కేంద్రం. ఇంకా మూడు రోజులే సమయం ఉన్నందున గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది.
PAN Aadhaar Link : జూన్ 30 వరకు గడువు పొడిగింపు
మార్చి 31 వరకు ఉన్న గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్ తో లింక్ అయ్యాయి. ఇంకా చాలా పాన్ కార్డులు లింక్ కావాల్సి ఉంది. ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లు ఖచ్చితంగా పాన్ కార్డు, ఆధార్ ను లింక్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. జూన్ 30 లోపు పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేసుకోకపోతే.. పాన్ కార్డు ఉపయోగంలో ఉండదు. ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయడానికి కూడా కుదరదు. అందుకే.. జూన్ 30 లోపు ఆధార్, పాన్ ను లింక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.