ChatGPT : ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్ జీపీటీ గురించే చర్చ. గూగుల్ ను తలదన్నేలా గూగుల్ ను మించి ఒక సెర్చ్ ఇంజన్ రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నిజానికి.. చాట్ జీపీటీ ఇంకా పూర్తి స్థాయిలో లాంచ్ కాలేదు. కేవలం బీటా వెర్షన్ నే విడుదల చేశారు. ప్రస్తుతం దీని టెస్టింగ్ నడుస్తోంది. టెస్టింగ్ ఫేజ్ లోనే దీనికి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే.. దీని బీటా వర్షన్ లాంచ్ కాగానే.. కొన్ని రోజుల వ్యవధిలోనే లక్షల మంది యూజర్లు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. నిజానికి.. ఒక గూగుల్ కు కూడా అంత మంది యూజర్లు అంత తక్కువ వ్యవధిలో రాలేదు. అందుకే సోషల్ మీడియాలో చాట్ జీపీటీ ఒక్కసారిగా సంచలనం అయిపోయింది. ప్రస్తుతం దీన్ని వెబ్ సైట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ అనే కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. దీన్ని ఏఐ చాట్ బాట్ అంటారు.
మనకు ఏదైనా సమాచారం కావాలంటే సాధారణంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సంబంధిత కీవర్డ్ తో సెర్చ్ చేస్తాం. కొందరు వికీపీడియాకు వెళ్లి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటారు. కానీ.. ఇప్పుడు గూగుల్, వికీపీడియా లాంటి వాటి అవసరం లేకుండా.. ఏ సమాచారాన్ని అయినా చాట్ జీపీటీలో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందులో మరో వెసులుబాటు ఏంటంటే.. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చాట్ జీపీటీ కావాల్సిన సమాచారాన్ని అంత అర్థవంతంగా యూజర్లకు అందిస్తుంది. అందుకు చాట్ జీపీటీ అంటే జనాల్లో అంత క్రేజ్ వచ్చేసింది.
ChatGPT : చాట్ జీపీటీ ఫుల్ పామ్ ఎంటి?
చాట్ జీపీటీ అంటే.. చాట్ జనరేటివ్ ప్రీ ట్రెయినింగ్ ట్రాన్స్ ఫార్మర్. అంతే ఈ చాట్ బాట్ కు ముందే ట్రెయినింగ్ ఇస్తారన్నమాట. దానికి ట్రెయినింగ్ ఇచ్చినట్టుగా అది వర్క్ చేస్తుంది. మిషిన్ లాంగ్వేజ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్పీ) ఆధారంగా ఇది పని చేస్తుంది. https://chat.openai.com/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకొని చాట్ జీపీటీని ఉపయోగించవచ్చు. ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవడం కోసం.. చాట్ బాక్స్ లో కీవర్డ్స్ ను టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే.. చాట్ జీపీటీ ప్రస్తుతం 2021 సంవత్సరం వరకు ఉన్న డేటాను మాత్రమే అందిస్తుంది. ఆ తర్వాత డేటా కోసం సెర్చ్ చేస్తే మాత్రం అది సమాచారం అందించదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక యాప్ ను కంపెనీ లాంచ్ చేయనుంది. కానీ.. అప్పటి వరకు కంపెనీ వెబ్ సైట్ ద్వారానే దీన్ని ఉపయోగించవచ్చు. 2021 సంవత్సరం లోపు ఉన్న అన్ని కేటగిరీలకు సంబంధించిన డేటాతో చాట్ జీపీటీని అనుసంధానం చేశారు. కానీ.. గూగుల్ లా ఇది మల్టిపుల్ రిజల్ట్స్ ను అందించదు. మీ ప్రశ్నకు సంబంధించి ఒకే సమాధానాన్ని అక్కడ వివరిస్తుంది. గూగుల్ కు, చాట్ జీపీటీకి ఉన్న తేడా అదే. గూగుల్ లో ఏదైనా సమాచారం కోసం సెర్చ్ చేస్తే పలు రకాల రిజల్ట్స్ వస్తాయి. వాటిలో మనకు నచ్చిన లింక్స్ ను ఓపెన్ చేసుకొని సమాచారం తెలుసుకోవచ్చు. ఇందులో అలాంటి ఆప్షన్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం.. మీకు ఏ విషయం మీద అయినా డౌట్ ఉంటే వెంటనే చాట్ జీపీటీలోకి వెళ్లి సెర్చ్ చేసి తెలుసుకోండి మరి.