2FA : ఇది టెక్నాలజీ యుగం. ఇక్కడ రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంతలా అంటూ రాత్రికి రాత్రే టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నిజానికి టెక్నాలజీ లో కొత్త కొత్త ఫీచర్స్ రావడం అనేది మంచిదే. దాని వల్ల ఎన్నో పనులు ఎంతో ఈజీగా అయిపోతుంటాయి. టెక్నాలజీ వల్ల మనిషికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇది వరకు బ్యాంకు లావాదేవీలు చేయాలంటే రోజు మొత్తం బ్యాంకులో పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ.. నేడు అరచేతిలో బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు. సెకండ్లలో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇదంతా కేవలం టెక్నాలజీ వల్ల వచ్చిందే.

ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ దెయ్యం కూడా ఉంటుంది.. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది.. అని మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు కదా.. అలాగే ఎక్కడైతే టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతోందో.. అక్కడే హ్యాకర్స్ కూడా ఉంటారు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే టెక్నాలజీని డిస్టర్బ్ చేస్తారు. సెక్యూరిటీని బద్దలు కొడతారు. ముఖ్యమైన డేటాను, సెన్సిటివ్ డేటాను ఎత్తుకెళ్తారు. దీని వల్ల టెక్నాలజీని ఉపయోగించే వాళ్లకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అంటే.. టెక్నాలజీ అభివృద్ధి చెందగానే కాదు.. ఆ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఎలా దానికి సెక్యూరిటీ ఇవ్వాలి.. అనేది కూడా ముఖ్యమే. అందుకే.. సెక్యూరిటీ అనేది బాగా పాపులర్ అయింది. మనం.. ఏ టెక్నాలజీని అభివృద్ధి చేసినా.. దానికి తగిన సెక్యూరిటీ ఉంటేనే దాన్ని వాడటానికి పదిమంది ముందుకు వస్తారు. లేదంటే దాన్ని ఎవ్వరూ వాడరు.
ప్రస్తుతం నేటి యూత్ ఎక్కువగా వాడేది మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ లావాదేవీలు.. ఇంకా ఇతర టెక్నాలజీలను బాగా ఫాలో అవుతుంటుంది నేటి యూత్. చాలామంది మెయిల్స్ అకౌంట్లకు సెక్యూరిటీ స్ట్రాంగ్ గా లేకపోతే హ్యాకర్స్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను తస్కరించే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల.. మెయిల్ లో ఉన్న ముఖ్యమైన డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇలా.. హ్యాకర్ల నుంచి, ఇతర ప్రమాదాల నుంచి మన అకౌంట్లను కాపాడుకోవడానికి.. వచ్చిన సెక్యూరిటీ ఫీచరే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ( two factor authentication). దాన్నే two step verification(2sv) అని కూడా పిలుస్తారు.
Two Factor Authentication(2FA) అంటే ఏంటి?
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. మీ అకౌంట్ ను సెక్యూరిటీని పెంచుకోవడం. అది ఒక ఎక్స్ ట్రా లేయర్ లా పనిచేస్తుంది. సాధారణంగా ఏదైనా అకౌంట్ కి లాగిన్ అవ్వాలంటే.. యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది వన్ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అదే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. ఫాస్ వర్డ్ ఇచ్చినా కూడా అకౌంట్ ఓపెన్ కాదు. పాస్ వర్డ్ ఇచ్చాక.. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా సెట్ చేసుకున్న సెక్యూరిటీకి సంబంధించిన కీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉంది అనుకోండి. దానికి టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను సెట్ చేసుకుంటే.. మీరు ఎప్పుడైనా ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలంటే.. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో పాటు.. టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఫేస్ బుక్ ఓపెన్ అవుతుంది. అంటే.. ఒకవేళ హ్యాకర్లు మీ ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసినా కూడా వాళ్లు ఫేస్ బుక్ ను ఓపెన్ చేయలేరు. దానికి కారణం.. మీ ఫేస్ బుక్ కు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ లో ఉండటం.
మీరు ఫేస్ బుక్ కు లాగిన్ కావాలనుకుంటే.. మీ పాస్ వర్డ్ తో పాటు.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పంపించిన కోడ్ ను ఫేస్ బుక్ లాగిన్ టైమ్ లో ఇవ్వడమో.. లేక మీ మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను యాక్సెప్ట్ చేయడమో.. ఈ రెండింట్లో ఏదో ఒకటి చేస్తేనే మీకు ఫేస్ బుక్ ఓపెన్ అవుతుంది. లేదంటే.. కేవలం పాస్ వర్డ్ తోనే ఫేస్ బుక్ ఓపెన్ కాదు.

ఈ ఫీచర్ ఒక్క ఫేస్ బుక్ లోనే కాదు.. అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో ఉంది. దాని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి.. two factor authentication ను enable చేసుకోవాలి. జీమెయిల్, ఇతర ముఖ్యమైన అకౌంట్లకు ఖచ్చితంగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇస్తే.. జన్మలో కూడా హ్యాకర్ మీ అకౌంట్ ను హ్యాక్ చేసే అవకాశం ఉండదు.