why tech companies lay off employees
why tech companies lay off employees

IT Layoffs : మీ అబ్బాయి ఏం చేస్తాడు.. అంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. మీ అల్లుడు ఏం చేస్తాడు అంటే అమెరికాలో సాఫ్ట్ వేర్ అండి అంటారు. ఇలా.. ఎవరు చూసినా.. ఎక్కడ చూసినా ప్రధానంగా వినిపించేది ఇదే. సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే వాళ్లకు ఉండే డిమాండ్, మర్యాద వేరు. దానికి కారణం.. వాళ్లకు వచ్చే ప్యాకేజీ, బెనిఫిట్స్. ఏ రంగంలో లేని అడ్వాంటేజెస్ ఈ రంగంలోనే ఉంటాయి. లక్షల్లో జీతాలు, రెండు రోజులు వీకెండ్, అవకాశం వస్తే విదేశాలకు… ఇలా సాఫ్ట్ వేర్ రంగంలో చేయలేనిది అంటూ ఏదీ ఉండదు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు. అదే ఇప్పుడు అందరి కొంప ముంచింది.

సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఫలానా డిగ్రీ చదవాలి అనే రూల్ ఏం లేదు. నీకు సత్తా ఉంటే.. నీలో నైపుణ్యాలు ఉంటే.. కోడింగ్ రాసే శక్తి ఉంటే ఎవరైనా సాఫ్ట్ వేర్ జాబ్ చేయొచ్చు. అందుకే సాఫ్ట్ వేర్ రంగంలోకి కుప్పలు తెప్పలుగా జనాలు ఎగబడుతున్నారు. యావరేజ్ గా వంద మందిని తీసుకుంటే అందులో సాఫ్ట్ వేర్ జాబ్ చేసేందుకు అర్హత ఉన్నవాళ్లు కనీసం10 మంది కూడా ఉండరు. మిగితా 90 మంది ఫేక్ ఎక్స్ పీరియెన్స్ పెట్టడం, ప్రాక్సీని ఉపయోగించుకొని ప్రాజెక్ట్ లు చేయడం, గూగుల్ ను నమ్ముకోవడం.. ఇలా రకరకాలుగా చేస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్నారు. అదే ఇప్పుడు సాఫ్ట్ వేర్ రంగాన్ని ప్రమాదంలో పడేసింది. నిజానికి సరైన స్కిల్స్ ఉన్న ఎవరినీ కంపెనీ వదులుకోవడానికి ఇష్టపడదు. కంపెనీ ప్రాజెక్ట్ లో అనుభవం ఉన్నవాళ్లను కంపెనీలు తీసేయవు. కానీ.. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తీసేస్తున్నాయి అంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి పర్ ఫార్మెన్స్ ఇష్యూ కాగా.. మరొకటి హై ప్యాకేజీ.

IT Layoffs : ఐటీ రంగంలో లేఆఫ్స్ కామనేనా?

నిజానికి ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కామన్. చాలా కామన్. చిన్న చిన్న కంపెనీలలో, స్టార్టప్స్ లో ఇవి తరుచూ జరుగుతూనే ఉంటాయి. కానీ.. అవి పెద్దగా బహిర్గతం కావు. ఉదాహరణకు ఒక స్టార్టప్ ను తీసుకుంటే ఆ కంపెనీకి ప్రాజెక్టులు వస్తేనే ఆ స్టార్టప్ ముందుకు వెళ్లగలదు. ఒకవేళ ఆ కంపెనీకి ఎలాంటి ప్రాజెక్ట్ రాకపోతే ఆ కంపెనీ యాజమాన్యం.. ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేదు కదా. ప్రాజెక్టులు ఉంటేనే సాఫ్ట్ వేర్ రంగంలో మనుగడ. లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే. అలా కొన్ని లక్షల చిన్నకంపెనీలు మూతపడ్డాయి. కానీ.. వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. పెద్ద కంపెనీల మీదనే అందరి దృష్టి ఉంటుంది.

పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ప్రాజెక్ట్ లేకపోతే, లక్షలకు లక్షలు ఇచ్చి ఉద్యోగిని మేపదు. అందుకే.. ఇప్పుడు జరుగుతున్న లేఆఫ్స్. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుంటోంది. దానికి ప్రధాన కారణం కోవిడ్. అది ఒక్క ఐటీ ఇండస్ట్రీనే దెబ్బతీయలేదు. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అయితే.. ఐటీ ఇండస్ట్రీలో లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రిక్రూట్ మెంట్ జరిగింది. లాక్ డౌన్ సమయంలో జనాలంతా ఆన్ లైన్ వైపు మొగ్గు చూపడంతో ఐటీ ప్రాజెక్టులు పెరిగాయి. దీంతో కంపెనీలు త్వరగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువమందిని రిక్రూట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మళ్లీ కొత్త ప్రాజెక్టులు లేవు. అందుకే కంపెనీలు కాస్ట్ కటింగ్ అంటూ.. అవసరం లేని ఉద్యోగులను తీసేస్తున్నాయి. హై ప్యాకేజ్ ఉండి.. పర్ ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నవాళ్లనే ముందు తీసేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

పెద్ద పెద్ద కంపెనీలలోనే లేఆఫ్స్ జరగడం లేదు. చిన్న కంపెనీలలోనూ జరుగుతున్నాయి. అయితే ఐటీ రంగం అనేది అనిశ్చితి రంగం. ఇక్కడ ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కానీ.. ఐటీ రంగానికి మాత్రం భవిష్యత్తులో ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతోందో అందరికీ తెలుసు. కానీ.. ఐటీ రంగంలో రాణించాలంటే దానికి తగ్గ స్కిల్స్ ను సంపాదించుకోవాలి. ప్రాజెక్ట్ లను చేసే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, క్లయింట్ ను మేనేజ్ చేసే టాలెంట్.. ఇవన్నీ ఉంటే ఐటీ రంగంలో ఎలాంటి ఢోకా ఉండదు. ఎలాంటి కోడింగ్ స్కిల్స్ లేకుండా క్లయింట్ ను మేనేజ్ చేసే టాలెంట్ లేకపోతే, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోతే ఐటీ రంగంలో రాణించలేరు. అటువంటి వాళ్లు ఏ కంపెనీలో చేరినా.. వాళ్లకు పింక్ స్లిప్ తప్పదు.