Chiranjeevi: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో హీరోగా నటించి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపుగా దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా తన నిజ జీవితం లో కూడా ఎన్నో మంచి పనులను చేస్తూ రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. అందుకే సినీ రంగంలో ప్రధానం చేసేటువంటి ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు మానవత దృక్పథంతో వ్యవహరించి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.
అయితే ఇటీవలే నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలుగులో వాల్తేర్ వీరయ్య అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు బాబి కొల్లి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. తాజాగా నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి లైబ్రరీ నిర్మాణం కోసం తన ఇంటి స్థలాన్ని అడిగితే మూడు లక్షల రూపాయలకు అమ్మేశారని పలు అవాస్తవ కథనాలు వినిపించిన విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగా లైబ్రరీ నిర్మాణం కోసం అడిగిన స్థలం తనది కాదని అది తన తల్లి అంజనీదేవి సోదరుడు, తన మేనమామదని అందుకే తనకి ఆ స్థలం పై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు.. కానీ కొందరు ఈ విషయం తెలియకుండా ఆ స్థలం తనదేనని అబద్ధపు ప్రచారాలు చేస్తూ తనని రాజకీయంగా అలాగే సినిమాల పరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఇలాంటి విషయాల గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని అలాగే తాను తన స్నేహితుడు అడిగాడని పాలకొల్లు గ్రామంలో ఒక గ్రంథాలయం నిర్మించి ఇచ్చానని కూడా తెలిపాడు. కానీ కొందరు తమ స్వప్రయోజనాల కోసం తన గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం కొంతమేర ఇబ్బందిగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు.